పాలమూరు, రంగారెడ్డి పథకం పనుల పరిశీలన

పాలమూరు, రంగారెడ్డి పథకం పనుల పరిశీలన

  • పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నార్లాపూర్ వద్ద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4, 5 తేదీల్లో సందర్శించనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం అధికార యంత్రాంగంతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులు, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ప్యాకేజీ-3 కాలువల నిర్మాణ పనులు, ప్యాకేజీ-2 పరిధిలోని డెలివరీ సిస్టమ్, ప్యాకేజీ-1లోని పంప్ హౌస్ నిర్మాణాలను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి సందర్శించే ప్రాంతాలు, ప్రాజెక్టు పురోగతిని వివరించే విధానం, భద్రతా ఏర్పాట్లు, ప్రజాప్రతినిధుల సమన్వయం తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, జూన్ 4న సోమశిలలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా నిలుస్తోందన్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల రైతులకు ఈ ప్రాజెక్టు వరప్రదాయినిగా మారనుందని చెప్పారు. ఈ పథకం ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి స్వయంగా ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు వస్తున్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేలా భద్రత, పారిశుధ్యం, రవాణా, తాగునీరు, వైద్య సదుపాయాలు, విద్యుత్ సరఫరా తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రాజెక్టు నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి, ప్రభుత్వం సాగునీటి రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాల్లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌లు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి సందర్శించే మార్గాలు, హెలిప్యాడ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సమావేశ వేదిక, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply