రాయలసీమలో 150 ఏళ్ల పురపాలన

రాయలసీమలో 150 ఏళ్ల పురపాలన

  • రాష్ట్రంలో 3వ పురాతన మున్సిపాలిటీ – ఆదోని
  • 6 మున్సిపాలిటీలకు 150 ఏళ్ల చరిత్ర
  • 20 ఏళ్లలో 26 మున్సిపాలిటీల ఏర్పాటు

తిరుపతి (రాయలసీమ), ఆంధ్రప్రభ బ్యూరో: రెండు శతాబ్దాల క్రితం నిజాం నవాబు బ్రిటిష్ వారికి అప్పగించిన దత్తమండల ప్రాంతం, దాదాపు వందేళ్ల క్రితం రాయలసీమగా రూపాంతరం చెందకముందే ఘనమైన పురపాలక వ్యవస్థకు కేంద్రంగా పేరొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ పురాతన మున్సిపాలిటీగా ఆదోని మున్సిపాలిటీ ప్రసిద్ధి గాంచింది. రాష్ట్రంలో 150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన 16 మున్సిపాలిటీలలో ఆరు రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. 2000–2021 మధ్యకాలంలో రాష్ట్రంలో ఏర్పడిన 54 కొత్త మున్సిపాలిటీలలో 26 రాయలసీమ ప్రాంతంలోనే ఏర్పడ్డాయి.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలులో ఉన్న మున్సిపల్ పాలనకు 1920 నాటి మద్రాస్ డిస్ట్రిక్ట్ మున్సిపాలిటీస్ యాక్ట్ పునాది కాగా, 1965 ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీస్ యాక్ట్ ఆధునిక వ్యవస్థకు నాంది పలికింది. 1970ల తరువాత జరిగిన చట్ట సవరణలతో జనాభా, విస్తీర్ణం, ఆదాయం, మౌలిక వసతుల ఆధారంగా మున్సిపాలిటీల వర్గీకరణ జరుగుతోంది.

పురపాలన అభివృద్ధి పథం
1886–1888 మధ్యకాలంలో ఏర్పడిన మున్సిపాలిటీలలో కర్నూలు (1866), కడప (1868), అనంతపురం (1869), తిరుపతి (1886), నంద్యాల (1899) ఉన్నాయి.
1912–1937 మధ్యకాలంలో ప్రొద్దుటూరు (1915), చిత్తూరు (1915), హిందూపురం, తాడిపత్రి (1920) మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. స్వాతంత్ర్యం తరువాత 1948–1988 మధ్యకాలంలో అనేక మున్సిపాలిటీలు స్థాపించబడ్డాయి. ప్రస్తుతం పంచాయతీలు నుంచి కార్పొరేషన్ల వరకు ఏడు స్థాయిలలో పురపాలన కొనసాగుతోంది.

ప్రస్తుతం మున్సిపల్ నిర్మాణం
రాష్ట్రంలో ప్రస్తుతం:

  • 17 మున్సిపల్ కార్పొరేషన్లు
  • 78 మున్సిపాలిటీలు
  • 28 నగర పంచాయతీలు

ఇందులో రాయలసీమ పరిధిలో:

  • 5 కార్పొరేషన్లు
  • 34 మున్సిపాలిటీలు
  • 12 నగర పంచాయతీలు ఉన్నాయి

వందేళ్ల చరిత్ర కలిగిన పురపాలికలు
శ్రీకాకుళం (1856), భీమునిపట్నం (1861) తరువాత ఏర్పడిన పలు మున్సిపాలిటీలతో రాష్ట్ర పురపాలన చరిత్ర బలపడింది. రాయలసీమలో శ్రీకాళహస్తి (1958), మదనపల్లె (1961), రాయదుర్గం (1963), ధర్మవరం, కదిరి (1964), ఎమ్మిగనూరు (1965), పుంగనూరు (1985) వంటి పట్టణాలు పురపాలనలో కీలక పాత్ర పోషించాయి.

2000–2021 మధ్యకాలంలో పులివెందుల, ధోన్, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, పలమనేరు, నగరి, పుత్తూరు, వెంకటగిరి (2005), బద్వేలు (2006), గుత్తి, మడకశిర, పుట్టపర్తి, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గూడూరు, నందికొట్కూరు, మైదుకూరు (2011), కళ్యాణదుర్గం, పామిడి, ఎర్రగుంట్ల, సూళ్లూరుపేట, నాయుడుపేట (2012), కమలాపురం, బేతంచర్ల, కుప్పం, పెనుకొండ, బి.కొత్తకోట (2020) మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి.

పెరిగిన పురపాలన ప్రాధాన్యం
రాజకీయ పరంగా చూస్తే, 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటుకి ముందు వరకు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగింది. 2013లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత సాధించింది. 2020–2021లో కరోనా సమయంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో గెలుపొందింది. 2024 ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొన్ని మున్సిపాలిటీలలో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అన్ని పురపాలక సంస్థల్లో ఎన్నికల కాలపరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.

వార్డుల పెంపు – ఎన్నికల సన్నాహాలు
జనాభా ప్రాతిపదికగా రాయలసీమలో:

  • 5 కార్పొరేషన్లలో డివిజన్లు 252 నుంచి 322కు
  • 40 మున్సిపాలిటీల్లో వార్డులు 1,132 నుంచి 1,474కు పెరగనున్నాయి. రాబోయే ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తూ పురపోరుకు సిద్ధమవుతున్నాయి.

Leave a Reply