Season5 | గ్రాండ్‌గా మ్యాచ్‌లు ప్రారంభం..
Season5 | గ్రాండ్‌గా మ్యాచ్‌లు ప్రారంభం..
కాకినాడ కింగ్స్ దే మొదటి విజయం
వైజాగ్ లయన్స్‌పై 72 పరుగుల తేడాతో గెలుపు
తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ ఆధిపత్యం
స్టీల్ ప్లాంట్ అగ్నిప్రమాదం నేపథ్యంలో నిరాడంబర ప్రారంభోత్సవం
నేడు డబుల్ హెడ్డర్‌తో క్రికెట్ సందడి…
Season5 | విశాఖపట్నం, ఆంధ్రప్రభ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5కు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఘనంగా తెరలేచింది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో ముందుగా ప్రకటించిన సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేసి, ఎలాంటి ఆర్భాటం లేకుండా టోర్నీని ప్రారంభించారు. ప్రమాద బాధితులకు సంఘీభావంగా ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగడం ప్రత్యేకంగా నిలిచింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టాస్ కార్యక్రమంలో పాల్గొని రెండు జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. టాస్ గెలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఆ నిర్ణయాన్ని కాకినాడ కింగ్స్ బ్యాటర్లు పూర్తిగా తిప్పికొట్టారు.

Season5 | యువన్ మెరుపులతో భారీ స్కోరు…
మొదట బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. అభిషేక్, అర్జున్ జట్టుకు శుభారంభం అందించగా, తపస్వి, మనీష్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువన్ వైజాగ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం కొద్ది బంతుల్లోనే రెండు ఫోర్లు, ఆరు భారీ సిక్సర్లతో ప్రేక్షకులను అలరించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో వికెట్ కీపర్ లేకాజ్ రెడ్డి కూడా ఏడు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు అదనపు బలం చేకూర్చాడు. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కాకినాడ కింగ్స్ 219 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. వైజాగ్ లయన్స్ తరఫున గిరినాథ్ రెడ్డి, ఢిల్లీ గణేష్, వినయ్ కుమార్, త్రిపురాన విజయ్ తలా ఒక వికెట్ సాధించారు.

Season5 | భారీ లక్ష్యానికి తలవంచిన వైజాగ్ లయన్స్..
220 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సింహాద్రి వైజాగ్ లయన్స్‌కు ఆరంభం ఆశాజనకంగానే కనిపించింది. తొలి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసినా, ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 10 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 6 వికెట్ల నష్టానికి 85 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రికీ భూయ్ (32), త్రిపురాన విజయ్ (33) పోరాడినా మిగిలిన బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. మరోవైపు కాకినాడ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఫలితంగా లయన్స్ జట్టు 18.4 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయి 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాకినాడ కింగ్స్ బౌలర్ ఆంజనేయులు మూడు కీలక వికెట్లు తీసి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో విధ్వంసక ప్రదర్శనతో జట్టు విజయానికి బాటలు వేసిన యువన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అతడి మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని ఏకపక్షంగా మార్చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


నేడు ఏపీఎల్‌లో డబుల్ హెడ్డర్…
ఏపీఎల్ ఉత్సాహం నేడు మరింత పెరగనుంది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు తుంగభద్ర వారియర్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ తలపడనున్నాయి. అనంతరం రాత్రి 7 గంటలకు విజయవాడ సన్ షైనర్స్, భీమవరం బుల్స్ మధ్య పోరు జరగనుంది. రోజురోజుకూ ఏపీఎల్‌కు ప్రేక్షకాదరణ పెరుగుతుండటంతో నేటి డబుల్ హెడ్డర్‌కు భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు స్టేడియానికి తరలివచ్చే అవకాశముంది. మ్యాచ్‌లతో పాటు వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రముఖ గాయని సమీర భరద్వాజ్ సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించనున్నారు. క్రికెట్ అభిమానులకు నేటి రోజు పండుగ వాతావరణాన్ని తీసుకురానుండగా, తొలి మ్యాచ్ విజయంతో కాకినాడ కింగ్స్ ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరిక పంపింది.
click here to read more : Bharati Fulmali | మహిళా క్రికెటర్ భారతి ఫుల్మాలి ఆవేదన
