Medicine Transport Train | ఔషధి ఎక్స్‌ప్రెస్‌తో ఫార్మా రంగానికి ఊతం

Medicine Transport Train | ఔషధి ఎక్స్‌ప్రెస్‌తో ఫార్మా రంగానికి ఊతం
Medicine Transport Train | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : ప్రయాణికుల సేవలు, వస్తు రవాణాతో పాటు అత్యాధునిక సేవలను కల్పించడంలో నూతన సాంకేతికతలు, ఆవిష్కరణలతో భారతీయ రైల్వే దూసుకుపోతోంది. ఇప్పుడు ఔషధాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీఎం గతిశక్తి కార్యక్రమానికి కొనసాగింపుగా ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిన హైదరాబాద్ నుంచి ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌పీటీ)కు ఔషధాల సరఫరా కోసం “ఔషధి ఎక్స్‌ప్రెస్” పేరుతో దేశంలోనే తొలి ప్రత్యేక ఫార్మసీ రైలు ఈనెల 2న ప్రారంభమైంది.
కీలకమైన ఫార్మా కంపెనీలకు కేంద్రమైన హైదరాబాద్‌లో తయారయ్యే ఫార్మా ప్రొడక్ట్స్‌ను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించడంతో పాటు అంతర్జాతీయంగా పంపిణీ చేసేందుకు ముంబై సమీపంలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్‌కు తరలించడం తప్పనిసరి. అందుకే హైదరాబాద్, జేఎన్‌పీటీని అనుసంధానిస్తూ ఈ ప్రత్యేక రీఫర్ రైలు (కోల్డ్ స్టోరేజ్ వసతి గల రైలు)ను ప్రారంభించడం హైదరాబాద్ ఫార్మా కంపెనీలకు చాలా మేలు జరగనుంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఫార్మా కంపెనీలకు ఎంతో ప్రయోజనం కలగనుంది. దేశాలకు సరైన సమయంలో ఔషధాలను చేరవేసేందుకు వీలు కలుగుతుంది.
తక్కువ ఖర్చుతో రవాణాకు మార్గం సుగమం
హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా, పటాన్‌చెరులోని ఫార్మా జోన్, ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీ తదితర ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే ఫార్మా ప్రొడక్ట్స్ సరఫరాకు ఈ రైలు చాలా కీలకం కానుంది. దేశవ్యాప్తంగా తక్కువ ఖర్చులో వస్తు రవాణా జరగడంతో పాటు సుస్థిరమైన, పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను ప్రోత్సహించేలా మోడీ ప్రభుత్వం రూ.100 లక్షల కోట్ల వ్యయంతో పీఎం గతిశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగానే ప్రత్యేక ఔషధి ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఫ్రీజర్ ఫెసిలిటీ లేకపోతే చాలా వరకు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ నాణ్యత తగ్గుతుంది. కాబట్టి హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో తయారయ్యే మందులను వాటి నాణ్యత తగ్గకుండా సరఫరా చేయాలనేది మోడీ సర్కారు సంకల్పం. ప్రభుత్వ రంగ సంస్థ అయిన కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీఓఎన్‌సీఓఆర్) ఆధ్వర్యంలో నడుస్తున్న సనత్‌నగర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో (ఐసీడీ) నుంచి ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి.
లైఫ్ సేవింగ్ మందులు.. ఇతర సరకులు..
“ఔషధి ఎక్స్‌ప్రెస్”గా నామకరణం చేసిన ఈ రిఫ్రిజిరేటర్ రైలు ద్వారా లైఫ్ సేవింగ్ మందులతో పాటు అవసరమైన ఇతర సరుకులను కూడా రవాణా చేయనున్నారు. హైదరాబాద్ నుంచి జేఎన్‌పీటీ వరకు ప్రయాణిస్తున్న సమయంలో కంటిన్యూస్ రిఫ్రిజిరేషన్ ఉండేందుకు డీజిల్ పవర్ ప్యాక్‌లతో కూడిన అధునాతన రీఫర్ కంటైనర్లు వినియోగిస్తున్నారు. ఇది కోల్డ్ చైన్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంతో పాటు ఫార్మాస్యూటికల్స్ సప్లై చైన్ కెపాసిటీని పెంచేందుకు కీలకమైన ముందడుగు కానుంది.
ప్రస్తుతం వారానికి ఒకసారి నడుస్తున్న ఈ ఔషధి ఎక్స్‌ప్రెస్‌ను డిమాండ్, వాణిజ్య వర్గాల అవసరాలకు అనుగుణంగా వారానికి రెండుసార్లు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్పెషల్ రీఫర్ రేక్స్ సర్వీస్ కారణంగా నాణ్యత తగ్గకుండా, ఎక్కువ రవాణా సమయం పట్టకుండా, తక్కువ ఖర్చులతో సప్లై చైన్ బలోపేతం అవుతుంది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా ఇన్నొవేషన్ బేస్డ్ సొల్యూషన్స్ తీసుకురావడంలో మోడీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది.
రానున్న రోజుల్లో కూడా అనేక పరిశోధనలతో పాటు ప్రయాణికులకు అందించే సౌకర్యాల విషయంలోనూ కృషి చేయనుంది. “ఔషధి ఎక్స్‌ప్రెస్” పేరుతో దేశంలోనే తొలి ప్రత్యేక ఫార్మసీ రైలును ప్రారంభించడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మొదటి రెగ్యులర్ ఔషధి ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలును తెలంగాణకు కేటాయించినందుకు ప్రధానమంత్రి, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
