Tamil Nadu Politics | టీవీకే సర్కారుపై ప్రతిపక్షాల వ్యూహాలు.. విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
Tamil Nadu Politics | టీవీకే సర్కారుపై ప్రతిపక్షాల వ్యూహాలు.. విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
పూర్తి మెజార్టీ దిశగా సీఎం విజయ్ దూకుడు
మూడు నుంచి ఆరు నెలల్లో ప్రభుత్వం మారొచ్చన్న స్టాలిన్
ఉప ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
కొత్త కూటమి ఏర్పాటుకు టీవీకే వేగంగా అడుగులు
Tamil Nadu Politics | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ బ్యూరో: అరవ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పూర్తి మెజార్టీ లేకున్నా, ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దళపతి విజయ్ చేశారు. తమిళనాడు అంటే సాధారణంగా డీఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలే ఏలుతుంటాయి. కానీ, తమిళ దళపతిగా పేరొందిన విజయ్ ఏకంగా పార్టీని నెలకొల్పడం, అధికారంలోకి రావడంతో అక్కడి రాజకీయాలు మారిపోయాయి. విజయ్ పార్టీకి పూర్తి మెజార్టీ లేకపోవడంతో కాంగ్రెస్‌తో పాటు చిన్నచితక పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బలాన్ని నిరూపించుకునే సందర్భంలో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు పలికారు.
ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అందులో మాజీ మంత్రి కూడా ఉండటంతో చేరికలు ఊపందుకునే పరిస్థితులు నెలకొన్నాయి.
పట్టు సాధిస్తున్న సీఎం విజయ్
పాలనలో విజయ్ దూకుడు పెంచారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాల వైపు నడుస్తూ, జనంతో మమేకం అవుతున్నారు. స్కూల్ ఫీజుల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం, ప్రజలను ఆదుకునేలా నిర్ణయాలు తీసుకోవడం, డ్రగ్స్‌పై ప్రచారం, అధికారులతో ఫ్రెండ్లీ విధానం, అవినీతి విషయంపై కఠినంగా వ్యవహరించడం, హిందూ దేవాలయాల్లో నుంచి వచ్చిన నిధులు వేరే వాటికి మళ్లించొద్దని, ఆ నిధులు దేవాలయాలకే ఉపయోగించాలని తీసుకున్న విధానంతో పాటు కీలక నిర్ణయాలు విజయ్‌కు మంచి పేరు తెచ్చిపెడుతున్నాయి.
ఈ ప్రభుత్వం కూలిపోతుంది: స్టాలిన్
తమిళనాడులోని విజయ్ ప్రభుత్వంపై మాజీ సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయకపోవచ్చని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం అని, మరో మూడు నుంచి ఆరు నెలల్లోనే రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. చెన్నైలో ఆదివారం జరిగిన పార్టీ చేరిక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. టీవీకేకు అసెంబ్లీలో అవసరమైన 118 స్థానాల మెజారిటీ లభించలేదని, కేవలం 108 స్థానాలకే పరిమితమైందన్నారు. ప్రజలు వాస్తవానికి డీఎంకే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఓటు వేశారని చేసిన విమర్శలు చర్చకు దారితీస్తున్నాయి.
కూటమి దిశగా విజయ్ అడుగులు
ప్రభుత్వం ఏర్పడి దాదాపు 50 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో మద్దతు పార్టీలన్నింటినీ ఒకే కూటమిగా కొనసాగించేందుకు టీవీకే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఆయా పార్టీలు డీఎంకే కూటమిని వీడడంతో, టీవీకే నేతృత్వంలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటు దాదాపు ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా జులై 1న జరగనున్న సమావేశానికి అధికారిక ఆహ్వానం అందజేశారు. ఈ సమావేశంలో కొత్త కూటమి పేరు, కూటమి నాయకత్వం, భాగస్వామ్య పార్టీల తరఫున సమన్వయకర్తల నియామకం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
