శ్రీనివాసపురంలో బహిరంగంగా అక్రమ ఇసుక దందా
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ: హుజూర్‌నగర్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో గత కొంతకాలంగా పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని గ్రామ యువకులు ఆరోపించారు. గ్రామ సమీపంలోని వాగుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని తెలిపారు. ఈ అక్రమ ఇసుక దందా వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, నదులు, వాగుల లోతు పెరగడంతో పాటు భూగర్భ జలాల మట్టం తగ్గిపోవడం, వ్యవసాయ భూములు దెబ్బతినడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక ట్రాక్టర్ల నిరంతర రాకపోకలతో గ్రామ రహదారులు దెబ్బతినడమే కాకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గురువారం మీడియా ఎదుట వాపోయారు. వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంతో పాటు అనుమతులు లేకుండా ఇసుక తవ్వకం, రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసపురం గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరారు.
