మామిడి వాగు బ్రిడ్జిని ముంచెత్తిన గోదావరి వరద

ఏటూరునాగారం, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న మామిడి వాగు బ్రిడ్జిని గోదావరి వరద ముంచెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో వాగులో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో బ్రిడ్జిపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాంపూర్ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తున్నందున గ్రామస్తులు ఎవరూ వాగు దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరించారు.

ముళ్లకట్ట గ్రామపంచాయతీ సర్పంచ్ ఈసం జనార్దన్ మాట్లాడుతూ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, రాంపూర్ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించిన ఆయన, వరద తగ్గే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని, అత్యవసరం లేకుంటే ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.