ఎరువుల దుకాణంపై ఆకస్మిక తనిఖీ

ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే లైసెన్స్ రద్దు: ఏడీఏ ఆదిరెడ్డి

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: మండలంలోని కోతులనడుమ గ్రామంలోని రైతు డిపో ఎరువుల దుకాణాన్ని సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) ఆదిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి రాజ్‌కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఎరువుల నిల్వలను పరిశీలించిన అధికారులు స్టాక్ రిజిస్టర్, బిల్లు పుస్తకాలను తనిఖీ చేశారు.

అనంతరం ఏడీఏ ఆదిరెడ్డి మాట్లాడుతూ, ఎవరైనా డీలర్లు గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే ఎక్కువ ధరకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే సంబంధిత డీలర్ల లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

డీలర్లు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ రైతులకు ఎమ్మార్పీ ధరలకే ఎరువులను విక్రయించాలని సూచించారు.