Devotional | అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు … తొలి దర్శనం చేసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం.. .. రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం, అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు.

అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు రధసప్తమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి రాష్ట్ర పండుగగా రధసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు జిల్లాపై ఉన్న అభిమానంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసామన్నారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తున్నారని, ఆదిత్యుడి దర్శనం కోసం సోమవారం రాత్రి నుంచే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారని.. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయన్నారు.

మూడు రోజుల పాటు జరుగుతున్న ఉత్సవాలతో శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ వచ్చిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆరోగ్య ప్రదాత దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారన్నారు. ఆలయం అభివృద్ధికి చర్యలు చేపట్టామని, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అరసవెళ్లి ఆలయాన్ని ప్రసాదం స్కీమ్‌లో చేరుస్తామని చెప్పారు. సూర్య భగవానుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రాచీన దేవాలయాలను కాపాడుకోవాలి అన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కార్యక్రమం చేయాలనే ఆలోచనతో పకడ్బంధిగా చేశామని చెప్పారు. కాగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ప్రభుత్వ చేసిన ఏర్పాట్లపై వారు ఆనందం వ్యక్తం చేశారు. స్వామివారిని గాయని మంగ్లీ, శాసనసభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, జిల్లా కలెక్టర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి దర్శించుకున్నారు.
పోటెత్తిన భక్త జనం ..
కాగా క్షీరాభిషేకం కోసం భక్తులు బారులు తీరారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించనున్నారు. ఆదిత్యుడి దర్శనం కోసం సోమవారం రాత్రి నుంచే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి..