ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాదర్బారు లక్ష్యం:

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
గొల్లపూడిలో వినతుల స్వీకరణ.. అధికారులకు తక్షణ ఆదేశాలు.

విజయవాడ రూరల్,ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రజాదర్బారు కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బారులో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి అర్జీలు సమర్పించారు.

ప్రతి వినతిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే పరిష్కరించగల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు నేరుగా సేవలందించడానికే ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

గ్రామాల వారీగా సమస్యలను గుర్తించి ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తామని, ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రజాదర్బారు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే కృష్ణప్రసాదు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.