ప్రతి ఓటరూ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలి
- ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్, ఆంధ్రప్రభ: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ప్రతి అర్హత కలిగిన ఓటరు ఈ నెల 23వ తేదీలోగా తమ ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (BLO) సమర్పించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వివరాలు నమోదు చేయించుకోకపోతే ఓటు జాబితా నుంచి పేరు తొలగిపోయే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బుధవారం తన స్వగ్రామమైన వేల్పూర్‌లో తహసీల్దార్ సమక్షంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తనతో పాటు కుటుంబ సభ్యుల ఓటరు వివరాలను స్వయంగా BLOలకు అందజేశారు. ఒక ఫారాన్ని అధికారులకు సమర్పించి, అధికారుల సంతకంతో కూడిన మరో ఫారాన్ని రసీదుగా తన వద్ద భద్రపరుచుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం చేపట్టిన S.I.R. కార్యక్రమాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. BLOలు ఇంటికి వచ్చినప్పుడు ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపి అందజేయాలని, అలాగే అధికారుల సంతకంతో కూడిన రసీదును తప్పనిసరిగా తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఫారం సమర్పించకపోయినా లేదా వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోయినా ఓటు గల్లంతయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఓటరు నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తున్న తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, BLOలకు ఎమ్మెల్యే పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, దేవాలయాలు లేదా ఇతర కేంద్రాల్లో ఒకేచోట కూర్చుని వివరాలు సేకరించడం సరికాదని, ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి ఓటర్లను కలుసుకుని వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం మాత్రమే ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
అలాగే ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) కూడా చురుకుగా పాల్గొని, BLOలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రతి అర్హత కలిగిన ఓటరు వివరాలు నమోదు అయ్యేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ తహసీల్దార్ అనిరుద్, గ్రామ సర్పంచ్ అశోక్, ప్రతాప్ రెడ్డి, BLOలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
