బడిపిలుస్తోంది.. భవిష్యత్తుకు బాటలు వేస్తోంది..

బడిపిలుస్తోంది.. భవిష్యత్తుకు బాటలు వేస్తోంది..

  • ఇంటింటికీ విద్యా వెలుగుల‌ను తీసుకొస్తున్న కార్య‌క్ర‌మం
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

రెడ్డిగూడెం, ఆంధ్రప్రభ:

ప్రతి చిన్నారి బ‌డిబాట ప‌ట్టి విద్యను అందుకొని ఉన్నత భవిష్యత్తు సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన “బడిపిలుస్తోంది” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శుక్ర‌వారం రెడ్డిగూడెంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో జ‌రిగిన బ‌డి పిలుస్తోంది కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పాల్గొన్నారు. బ‌డిలో చేరిన చిన్నారుల‌తో ముచ్చ‌టించి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పాఠశాల వయసు గల ప్రతి బాలబాలిక బడిలో చేరేలా అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామస్థాయిలోని సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతను వివరించి, పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపేలా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు తదితర సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. విద్య ద్వారా కుటుంబంలో వెలుగులు నింపడమే “బడిపిలుస్తోంది” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో డీఈవో ఎల్‌.చంద్ర‌క‌ళ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply