ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమం
వైఎస్సార్ ఆశయ సాధనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ పోరాటం
కూటమి ప్రభుత్వంలో దండగగా మారిన వ్యవసాయం..
రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు…
విజయవాడ, ఆంధ్రప్రభ : దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్‌కు బాటలు వేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పేర్కొన్నారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్ లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చారిత్రాత్మక పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న ప్రజానేత వైఎస్సార్ అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రైతుల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్ ఫైల్‌పై వైఎస్సార్ తొలి సంతకం చేశారన్నారు. నాడు ఆయన వేసిన అడుగే.. నేటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ నిరంతరాయంగా కొనసాగడానికి బాటలు వేసిందన్నారు. వైఎస్సార్ జన్మదినాన్ని రైతు దినోత్సవం గా ప్రకటించి, అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ ఐదేళ్ల హయాంలో ఆర్బీకేలు, క్రాప్ ఇన్సూరెన్స్, గిట్టుబాటు ధరలతో రైతులకు స్వర్ణయుగం సాగిందని విష్ణు పేర్కొన్నారు. ప్రస్తుత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం మళ్లీ దండగగా మారిందని మల్లాది విష్ణు మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన చారిత్రాత్మక రీసర్వే భూములకు కూటమి ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. రెండేళ్లు గడుస్తున్నా దాదాపు 65 లక్షల మందికి పాస్ పుస్తకాలు పంపిణీ చేయలేని అసమర్థ పాలన సాగుతోందని విమర్శించారు.
పాస్ పుస్తకాల పంపిణీలో సైతం విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని, రైతుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, లాకప్ డెత్‌లపై సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు సాగిస్తున్న చట్ట వ్యతిరేక పరిపాలనపై యువత, ప్రజలు తిరగబడాలన్నారు. మహానేత వైఎస్సార్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందన్నారు.మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఆయన హయామే రాష్ట్రానికి స్వర్ణయుగమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే.. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, పేదల ప్రాణాలు కాపాడే ఆరోగ్యశ్రీ, అన్నదాతలకు ఉచిత విద్యుత్ వంటి విప్లవాత్మక పథకాలు వచ్చేవి కావు అని గుర్తుచేశారు.
కేవలం ఐదు సంవత్సరాల స్వల్ప పాలనలోనే కోట్లాది మంది ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయేలా సంక్షేమ పథకాలను అమలు చేశారని ఆయన ప్రశంసించారు. 14, 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలించామని గొప్పలు చెప్పుకునే వారు.. తమ హయాంలో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒక్కటంటే ఒక్క పథకం పేరైనా చెప్పగలరా?” అని ఆయన సవాల్ విసిరారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగించారని వెల్లంపల్లి పేర్కొన్నారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ బలోపేతం, 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు చేయూత వంటి అద్భుతమైన పథకాలను అందించి ప్రతి ఇంటికీ మేలు చేశారని వివరించారు.
రాష్ట్రంలో మళ్లీ పేదల పక్షపాతి ప్రభుత్వం ఉండాలన్నా, సంక్షేమ పాలన నిరంతరాయంగా సాగాలన్నా, వైఎస్సార్ నాటి స్వర్ణయుగం మళ్లీ వర్ధిల్లాలన్నా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, ఆసిఫ్, బెల్లం దుర్గ, పుణ్యశీల, వంగవీటి నరేంద్ర, పోతిన మహేష్, తోలేటి శ్రీకాంత్, రవిచంద్ర, దొడ్డ అంజిరెడ్డి, రామిరెడ్డి, జానారెడ్డి, త్రివేణి రెడ్డి, వరలక్ష్మి లతో పాటు పలువురు వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
