11 కేవీ విద్యుత్ తీగ తగిలి కేబుల్ ఆపరేటర్ మృతి
జన్నారం, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రాంపూర్‌లో విద్యుత్ షాక్‌కు గురై కేబుల్ ఆపరేటర్ మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన దుర్గం పోచయ్య (43) రాంపూర్–తిమ్మాపూర్ గ్రామాల మధ్య తెగిపోయిన డిష్ కేబుల్ వైరును సరిచేస్తుండగా ప్రమాదం జరిగింది. విద్యుత్ పోల్ వద్ద కేబుల్ వైరును లాగుతున్న సమయంలో అది ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో పోచయ్య విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
వెంటనే చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మృతుడు పోచయ్యకు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. పోచయ్య మృతిపై దండేపల్లి, జన్నారం మండలాల్లోని పలువురు కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్‌ఓలు సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
