నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

  • ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
  • కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలమ్

రామడుగు, ఆంధ్రప్రభ: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలమ్ పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు మండలం వెలిచాల గ్రామంలో పోలీస్- మీ కోసం అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన 40 అధునాతన సీసీటీవీ కెమెరాలను కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ప్రారంభించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, నె రాల నియంత్రణలో సీసీటీవీల పాత్ర కీలకమని తెలిపారు. వెలిచాలలో పాత కెమెరాల స్థానంలో 40 కొత్త కెమెరాలు ఏర్పాటు చేశామని, కమిషనరేట్ పరిధిలో ప్రతి మూలను నిఘా పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. రాబోయే రోజుల్లో మరో 700 కొత్త కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సర్పంచ్ వీర్ల నర్సింగరావు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులను అభినందించారు. అలాగే ఆన్లైన్ గేమింగ్ వ్యసనంతో యువత ఆత్మహత్యలు, డబ్బు నష్టపోతున్న ఘటనలు జిల్లాలో వెలుగు చూస్తున్నాయని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. గ్రామాల్లో డ్రగ్స్ సరఫరా, వాడకంపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు తెలియజేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

రహవీర్ పథకం ద్వారా ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం రూపాయలు 25,000 ప్రోత్సాగ వాకం ఇస్తుందని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రఫీక్, రామడుగు ఎస్ఐ రాజు, సర్పంచ్ వీర్ల నర్సింగరావు, గ్రామ పెద్దలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.