ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలి: ఎస్పీ
ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితిక పంత్ ప్రజల సమస్యలను స్వయంగా విని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 15 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ, సమస్యల పరిష్కారానికి సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తగిన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు చేరువగా ఉంటూ, శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తోందని ఆమె తెలిపారు.
