మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపణలు
రాష్ట్రానికి రావాల్సిన నీటిని ఏపీకి మళ్లించే ప్రయత్నం
పాలమూరుకు వెంటనే నీటి విడుదల చేయాలని డిమాండ్..
లేకపోతే 11న కేటీఆర్ ఆధ్వర్యంలో రైతుల భారీ ర్యాలీ హెచ్చరిక
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు మళ్లించే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి అందుబాటులో ఉన్న నీటి పరిమాణంపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
ప్రస్తుతం సుమారు 170 నుంచి 180 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, కేవలం 47 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని ఆయన ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చుట్టూ ఉన్న కొందరు ఇంజినీర్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారేనన్న అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఏపీకి చెందిన వ్యక్తిని నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించి, ఆయన సూచనల మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని కూడా నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరు, శ్రీశైలం ప్రాంతాలకు నీటిని విడుదల చేయొద్దని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. పాలమూరుకు నీరు ఇవ్వకపోతే సీఎం రేవంత్‌రెడ్డి అపఖ్యాతి పాలవుతారని ఉత్తమ్ భావిస్తున్నారేమోనని, మరోవైపు పాలమూరును ఎండబెడితే తనను ఏపీ సీఎం చంద్రబాబు అభినందిస్తారని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారేమోనని విమర్శించారు.
పాలమూరు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే నీటిని విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 11వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు. పాలమూరుకు క్షమాపణ చెప్పే పరిస్థితి రాకముందే ప్రభుత్వం స్పందించి తక్షణమే నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని నిరంజన్‌రెడ్డి కోరారు.
