త్వ‌ర‌లో తెలంగాణ కేబినెట్ విస్తరణ ?

ఇద్దరికి మంత్రి యోగం?
కేబినెట్‌ ప్రక్షాళనకు బ్రేక్‌
విస్తరణకే అధిష్ఠానం మొగ్గు
రెండు ఖాళీ మంత్రి పదవుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌
వారం.. పది రోజుల్లోనే రెండు బెర్తుల భర్తీకి ఛాన్స్‌
ఎస్టీ కోటాలో మంత్రి పదవికి రామచంద్ర నాయక్‌, బాలు నాయక్‌ పేర్లు
రెండో బెర్త్‌ కోసం మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి ప్రయత్నాలు
మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆశలు
ఎన్నికలకు ముందే మంత్రి పదవి హామీ ఇచ్చారంటున్న రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను త్వరలోనే భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. కేబినెట్‌లో భారీ ప్రక్షాళన కంటే, ప్రస్తుతం ఉన్న రెండు ఖాళీలను మాత్రమే భర్తీ చేసే దిశగా పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

వచ్చే వారం నుంచి పది రోజుల్లోగా మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అధిష్ఠానం స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవుల్లో ఒకదాన్ని లంబాడా (ఎస్టీ) సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కోటాలో మాజీ మంత్రి రామచంద్ర నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

మరో మంత్రి పదవి కోసం మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే సమయంలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని ఆయన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు సమాచారం.

అయితే, మంత్రి పదవుల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్ఠానం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో మంత్రి వర్గ విస్తరణపై అధికారిక నిర్ణయం వెలువడే వరకు ఈ అంశంపై కొనసాగుతున్న ప్రచారానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.