నాగార్జునసాగర్ విజయవిహార్ ప్రాంగణంలో నిర్వహణ
సాయంత్రం పూర్ణాహుతికి హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
కృష్ణా, గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని..
పాడిపంటలు సమృద్ధిగా పండాలనే సంకల్పంతో యాగం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, జలాశయాలు నిండాలని ఆకాంక్షిస్తూ ఆగస్టు 10న వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతులు సంప్రదించి ఆగస్టు 10వ తేదీని యాగానికి శుభ ముహూర్తంగా ఖరారు చేశారు.
నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో ఈ వరుణ యాగాన్ని నిర్వహించనున్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదాద్రి దేవస్థానం అర్చకులు, వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం యాగ క్రతువులను నిర్వహిస్తారు. కృష్ణా, గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని, చెరువులు నిండాలని, రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని సంకల్పిస్తూ ప్రత్యేక పూజలు, హోమాలు చేపట్టనున్నారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. యాగం ముగింపు సందర్భంగా సాయంత్రం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని యాదాద్రి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఎంఎస్‌ఎన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.
