కాంట్రాక్టర్లను వేధించొద్దు
చిన్న కాంట్రాక్టర్లకు అండగా ప్రభుత్వం
అధికారుల వేధింపులు ఆపాలి
అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం
మైన్స్ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లను నిర్మాణ సామగ్రికి సంబంధించిన అనుమతుల పేరుతో వేధించవద్దని రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గనులు, భూగర్భశాఖ అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణానికి ఇసుక, మట్టి, మెటల్ వంటి నిర్మాణ సామగ్రి అత్యవసరమని, అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారిని వదిలేసి చిన్న, నిజాయితీగల కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదన్నారు.

శుక్రవారం సచివాలయంలో గనులు, భూగర్భశాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామితో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో రోడ్ల కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, టీజీఎండీసీ ఎండీ అనుదీప్ దురిశెట్టి, ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్ బి.వి.రావు, మైనింగ్ కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశంలో కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు అనుమతుల జారీ, జరిమానాల విధింపుపై పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. చిన్న కాంట్రాక్టర్లపై నిర్మాణ సామగ్రి విలువకు పది రెట్లు జరిమానాలు విధించడం సమంజసం కాదని మంత్రులు అభిప్రాయపడ్డారు.
కాంట్రాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు. రూ.5 కోట్ల విలువైన అంశంపై రూ.54 కోట్ల జరిమానా విధించడం అత్యంత అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఒప్పందాల ప్రకారం కాంట్రాక్టర్లు అన్ని చెల్లింపులు చేస్తున్నప్పటికీ వారిని వేధించడం సరికాదన్నారు.
తెలంగాణలో నాణ్యమైన రహదారుల నిర్మాణ లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) కింద రోడ్ల పనులు చేపట్టామని, 2028 ఆగస్టు నాటికి ఈ పనులను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కోమటిరెడ్డి తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి ప్రస్తావించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, చిన్న కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గనుల శాఖ అధికారులను ఆదేశించారు.
