చేనేతకు పూర్వ వైభవం తేవాలి

  • నేతన్న జీవితాలకు వెలుగు నింపాలి
  • చేనేత పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం
  • ఎమ్మెల్యే నాయకర్

నర్సాపురం, ఆంధ్రప్రభ: చేనేతకు పూర్వ వైభవం తీసుకువచ్చి నేతన్నల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నరసాపురం పట్టణంలోని వీవర్స్ కాలనీలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేనేతకు చేయుతనిచ్చే కార్య క్రమాలు చేపట్టి నేతన్లను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పవర్‌లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను 2026 ఏప్రిల్ 1 నుంచి అందిస్తున్నట్లు వివరించారు.

అలాగే ఎన్‌టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా 50 సంవత్సరాలు పైబడిన అర్హులైన చేనేత కార్మికులకు నెలకు రూ 4,000 పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వినియోగించడం ద్వారా చేనేత పరిశ్రమను, చేనేత కార్మికులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ చేనేత కార్మికులను సత్కరించి గౌరవించారు. వారి యొక్క అనుభవాలను పరిగణనలోకి తీసుకొని చేనేత రంగానికి జీవం పోయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి నేతలు, అధికారులు, చేనేత సంఘాల నాయకులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.