సామాన్య భక్తుల దర్శనానికే పెద్దపీట
- భక్తుల రద్దీతో అంతరాలయ, వీఐపీ దర్శనాలకు తాత్కాలిక విరామం
- వేలాదిమంది భక్తులకు వేగవంతమైన అమ్మవారి దర్శనం కల్పించిన దేవస్థానం
- క్యూలైన్లలో తాగునీరు, ఉచిత ప్రసాదం, అన్నప్రసాదంతో విస్తృత ఏర్పాట్లు
- వైర్లెస్, సీసీటీవీలతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించిన ఈవో వి.కె. శీనా నాయక్
- భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా ఆలయ యంత్రాంగం సమర్థ నిర్వహణ
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శుక్రవారం భక్తుల రద్దీ అధికంగా నమోదైంది. ఉదయం 11 గంటల తర్వాత అమ్మవారి దర్శనానికి వేలాదిమంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. అయినప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు సమర్థవంతమైన ఏర్పాట్లు చేసి దర్శనాలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించారు.
దేవస్థానం కీలక నిర్ణయం
సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది. ఈ చర్యతో సాధారణ భక్తుల దర్శనం వేగవంతమై, క్యూలైన్లలో నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గింది. ఆషాఢమాసంలో కొనసాగుతున్న అమ్మవారి సారె–చీరల సమర్పణ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, మంగళ ద్రవ్యాలతో అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆధ్యాత్మిక శోభ
తాళమేళాల నడుమ సాగిన ఈ కార్యక్రమం ఇంద్రకీలాద్రికి ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ స్వయంగా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు మొబైల్ వాహనాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు నిరంతరాయంగా అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే దర్శనానికి వచ్చిన ప్రతి భక్తికి ఉచిత ప్రసాదం పంపిణీ చేయడంతో పాటు, అన్నప్రసాద భవనంలో ఎలాంటి కొరత లేకుండా వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఆషాఢమాస భక్తి వైభవం
అంతేకాకుండా ఆలయ కంట్రోల్ రూమ్ నుంచి వైర్లెస్ వ్యవస్థ, సీసీటీవీ కెమెరాల ద్వారా నిమిష నిమిషం పరిస్థితులను ఈవో పర్యవేక్షించారు. రద్దీ పరిస్థితులకు అనుగుణంగా అధికారులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తూ క్యూలైన్ల నిర్వహణ, భద్రత, తాగునీరు, ప్రసాదాల పంపిణీ, భక్తుల రాకపోకలను సమన్వయం చేశారు. దీంతో శుక్రవారం రోజంతా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనాలు ప్రశాంతంగా కొనసాగాయి. భక్తుల సౌకర్యాల కల్పనకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, సామాన్య భక్తులకు సులభ దర్శనం కల్పించాలనే లక్ష్యంతో దేవస్థానం యంత్రాంగం సమిష్టిగా పనిచేసిందని అధికారులు తెలిపారు. ఆషాఢమాస భక్తి వైభవంతో పాటు క్రమబద్ధమైన నిర్వహణతో ఇంద్రకీలాద్రి మరోసారి భక్తుల ప్రశంసలు అందుకుంది.

