రూ.3.45 కోట్ల టోకరా

మై హోమ్ భూజాలో వెలుగులోకి..
వినాయకుడి లడ్డూ వేలం ద్వారా పరిచయాలు పెంచుకున్న ఇద్దరు
పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయల వసూలు
మోసపోయామని పోలీసులను ఆశ్రయించిన బాధితులు

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : నగరంలోని ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీ మై హోమ్ భూజాలో వినాయకుడి లడ్డూ వేలాన్ని ఆసరాగా చేసుకుని భారీ ఆర్థిక మోసం జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని నమ్మించి దాదాపు రూ.3.45 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితుల కథనం ప్రకారం.. గత ఏడాది వినాయక నవరాత్రి ఉత్సవాల్లో రూ.51 లక్షలకు వినాయకుడి లడ్డూను కొండపల్లి గణేష్, కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు దక్కించుకున్నారు. అనంతరం అపార్ట్‌మెంట్ వాసులకు లడ్డూ పంపిణీ చేస్తూ, వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నారని తెలిపారు.

ఆ తర్వాత వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి అపార్ట్‌మెంట్‌కు చెందిన ఐదుగురు నివాసితుల నుంచి మొత్తం రూ.3.45 కోట్ల పెట్టుబడులు తీసుకున్నట్లు ఆరోపించారు.

కొంతకాలం తర్వాత లాభాల గురించి అడిగితే నిందితులు స్పందించకపోవడంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పెట్టుబడుల లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు.