ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి

వాటి సంరక్షణను బాధ్యతగా భావించాలి

సైదాపూర్, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా సైదాపూర్ గ్రామంలోని చారిత్రాత్మక న్యాల చెరువు కట్ట వద్ద జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి ఆయన మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించడం, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు. మొక్కలు నాటడంతో సరిపెట్టకుండా వాటిని సంరక్షించే బాధ్యతను గ్రామ ప్రజలు, యువత తీసుకోవాలని సూచించారు.

చెరువు కట్టలు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలు, రహదారులకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సైదాపూర్ గ్రామ సర్పంచ్ మునిగంటి స్వప్నసంతోష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, వైస్ చైర్మన్ రాజ్‌కుమార్, పర్సన్ ఇన్‌చార్జి కొత్త తిరుపతిరెడ్డి, హుజూరాబాద్ ఆర్డీవో, తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్‌గౌడ్, ఎంపీడీవో యాదగిరి, ఏపీవోలు రాణి, తిరుపతి, గుండారపు శ్రీనివాస్, పల్లెని రవీందర్‌రావు, ఊసకోయిల రాఘవులు, వెలక రవీందర్, మిట్టపల్లి కిష్టయ్య, సారబుడ్ల రాజిరెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు.