ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకతే ప్రధానం
- క్లెయిమ్స్, అభ్యంతరాలను ఏడు రోజుల్లోగా పరిష్కరించాలి
- ప్రతిరోజూ కనీసం 70 కేసులపై విచారణ పూర్తి చేయాలని ఆదేశం
- క్షేత్రస్థాయి విచారణలో స్టేట్మెంట్లు పక్కాగా నమోదు చేయాలి
- రాజకీయ పార్టీలతో సమన్వయమే ఎస్‌ఐఆర్ విజయానికి కీలకం
- ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎం.వి. శేషగిరి బాబు
విజయవాడ, ఆంధ్రప్రభ: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అందిన ప్రతి క్లెయిమ్, అభ్యంతరాన్ని అత్యంత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, రాష్ట్ర లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ కార్యదర్శి ఎం.వి. శేషగిరి బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, ఏడు నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. కొంతమంది శాసనసభ్యులు వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎం.వి. శేషగిరి బాబు మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన ప్రతి క్లెయిమ్, అభ్యంతరం ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. నోటీసు జారీ చేసిన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా విచారణ పూర్తి చేసి తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పేరుకుపోకుండా ప్రతిరోజూ కనీసం 70 క్లెయిమ్స్, అభ్యంతరాలపై విచారణ నిర్వహించి పరిష్కరించాలని సూచించారు.
క్షేత్రస్థాయి విచారణలో సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను పూర్తిస్థాయిలో నమోదు చేయడంతో పాటు విచారణకు సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారిక రికార్డుల్లో పొందుపరచాలని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిబంధనల మేరకు పారదర్శకంగా వ్యవహరించాలని, క్లెయిమ్స్, అభ్యంతరాల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. రాజకీయ పార్టీలు కూడా తమ పరిధిలోని ఓటర్ల జాబితాలను పరిశీలించి లోపాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారంలో బీఎల్‌ఓలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో కొన్ని ఫోటోలు స్పష్టంగా లేవని గుర్తించామని, వాటిని ఈ దశలోనే సరిచేసి ప్రతి ఓటరు ఫోటో స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల ఓట్లు వీలైనంత వరకు ఒకే పోలింగ్ బూత్ పరిధిలో ఉండేలా పరిశీలించాలని ఆదేశించారు.
బీఎల్‌ఓలు, బూత్ లెవల్ ఏజెంట్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎస్‌ఐఆర్ ప్రక్రియ, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిశీలన, ఓటర్ల వివరాల ధ్రువీకరణపై పూర్తి అవగాహన కల్పించాలని సంబంధిత ఈఆర్‌ఓలను కలెక్టర్ ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా చురుకుగా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే ప్రక్రియకు సహకరించాలని కోరారు.
సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పలు సూచనలు చేశారు. గతంలో ఓటు హక్కు వినియోగించినప్పటికీ ప్రస్తుతం అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించలేని ఓటర్ల విషయంలో ప్రత్యేక పరిశీలన చేయాలని, భార్యాభర్తల ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సందర్భాలను సరిచూడాలని, కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కోరారు.
సమావేశం ముగింపులో ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాలను ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎం.వి. శేషగిరి బాబు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ ఎం. లక్ష్మీనరసింహం, మున్సిపల్ కమిషనర్ హెచ్.ఎం. ధ్యాన్ చంద్ర, వివిధ నియోజకవర్గాల ఈఆర్‌ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు.

