ఇళ్ల గణన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

ఇళ్ల గణన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి
- జిల్లా కలెక్టర్ కె.హరిత
జైనూర్, ఆంధ్రప్రభ: జనగణన 2027లో భాగంగా చేపట్టే ఇళ్ల గణన కార్యక్రమాన్ని జిల్లాలో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జైనూర్ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి నిర్ణీత 32 అంశాలపై సమాచారాన్ని క్షుణ్ణంగా సేకరించాలని సూచించారు. గణన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను నోట్ చేసుకోవాలని, సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జిల్లాలో గణన ఏర్పాట్లు..
జిల్లా వ్యాప్తంగా ఇండ్ల గణన కోసం చేసిన ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. జిల్లాలో మొత్తం 994 మంది ఎన్యుమరేటర్లు, 174 మంది సూపర్వైజర్లు ఈ విధుల్లో పాల్గొంటారని, గణన కోసం జిల్లాలో 1,689 ఇండ్ల జాబితా బ్లాకులను గుర్తించడం జరిగిందన్నారు. ఎలాంటి సాంకేతిక లేదా క్షేత్రస్థాయి లోపాలు లేకుండా ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జైనూర్ తహసీల్దార్ ఆడ బిర్శవ్, సంబంధిత అధికారులు, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
