విజయవాడలో మొబైల్ కోర్టు.. 23 మందికి జరిమానాలు
చెత్త వేయడం, పశువులను రోడ్లపై వదలడం, అనుమతుల్లేని వ్యాపారాలపై చర్యలు
చిట్టినగర్, ఆంధ్రప్రభ: విజయవాడ నగరంలో ప్రజా పరిశుభ్రతకు భంగం కలిగించే చర్యలపై విజయవాడ నగరపాలక సంస్థ కఠినంగా వ్యవహరిస్తోంది. రోడ్లపై చెత్తాచెదారం వేయడం, పశువులను వదిలేయడం, లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించడం వంటి చర్యలు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం–1955 ప్రకారం నేరమని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ సర్కిల్–1 కార్యాలయం పరిధిలోని 22 డివిజన్లలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సమరీ ట్రయల్ కేసులు నమోదు చేస్తున్నారు. నమోదైన కేసుల పరిష్కారం కోసం ప్రతి నెలా సర్కిల్ కార్యాలయంలో మొబైల్ కోర్టును నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం సర్కిల్–1 కార్యాలయంలో 8వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ టి.ఏ.ఎస్.ఎస్. రామ ఆదిత్య రిషిక్ ఆధ్వర్యంలో మొబైల్ కోర్టు నిర్వహించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మొత్తం 23 మందిపై నమోదు చేసిన సమరీ ట్రయల్ కేసులను కోర్టు ముందుకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన 23 మంది నుంచి మొత్తం రూ.6,750 జరిమానా వసూలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్‌వో డాక్టర్ అన్నపూర్ణ, శానిటరీ సూపర్వైజర్లు డి. సోమరాజు, ఎస్.వి.ఎస్. శ్రీధర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు జి. రంగారావు, శామ్యూల్, జి. శ్రీనివాసరావు, ఆనంద్ కృపాల్, వి. శ్రీనివాసరావు, ఎం. దుర్గారావు, ఆదినారాయణ, పి. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
