ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్‌ పేరుతో యాప్‌

యూరియా తరహాలోనే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల సరఫరా

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం రైతులు ఎరువులను కొనుగోలు చేసేందుకు, ముందస్తుగా బుక్‌ చేసుకునేందుకు ‘ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్‌’ పేరుతో మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టిందని చౌటుపల్లి ఏఈఓ పద్మ తెలిపారు.

శుక్రవారం కమ్మర్‌పల్లి మండలంలోని చౌటుపల్లి గ్రామంలో రైతులకు యాప్‌ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో అందుబాటులో ఉన్న యాప్‌లో కేవలం యూరియాను మాత్రమే బుక్‌ చేసుకునే అవకాశం ఉండేదన్నారు.

కొత్త యాప్‌లో డీఏపీ, పొటాష్‌తో పాటు వివిధ రకాల కాంప్లెక్స్‌ ఎరువులను కూడా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఎరువుల కొరత లేకుండా నిల్వ వివరాలు తదితర సమాచారం యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. దీంతో రైతులు నిల్వ ఉన్న చోటుకు వెళ్లి ఎరువుల బస్తాలను సులభంగా పొందవచ్చన్నారు.

ఇకపై రైతులు అన్ని రకాల ఎరువులను ఈ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకుని కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. నూతన యాప్‌ ద్వారా ఎరువులు పొందాలంటే ప్రతి రైతుకు రైతు నమోదు సంఖ్య తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.

ఈ సంఖ్య ఆధారంగానే యాప్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుందని, లేదా ఆధార్‌ కార్డుతో అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని ఏఈఓ పద్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.