కాసిపేట గురుకులంలో ఘనంగా బోనాల పండుగ
పోతురాజుల వేషధారణలో ఆకట్టుకున్న విద్యార్థులు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ కాసిపేట గురుకుల పాఠశాల, కళాశాలలో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతురాజుల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు.
డప్పు చప్పుళ్లతో బోనాలను అంగరంగ వైభవంగా తీసుకుని ఊరేగింపుగా అమ్మవారి వద్దకు వెళ్లారు. అనంతరం ప్రిన్సిపాల్ ఊటూరి సంతోష్ కుమార్ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రమంతటా ఘనంగా జరుపుకొనే పండుగల్లో బోనాల పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి వరకు జరుపుకుంటారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాలను జరుపుకోవడం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ జి. ప్రియాంక, ఉపాధ్యాయులు ఎస్. మంజుల, జి. శైలజ, దివ్య, గౌతం, నరేందర్‌తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
