కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ సోమవారం నిర్వహణ

కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ సోమవారం నిర్వహణ

ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్.. ప్రజలకు ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహ సూచనలు

నరసరావుపేట, ఆంధ్రప్రభ: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్థానిక జిల్లా కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలతో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

అర్జీదారులకు సూచనలు

సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలతో అర్జీ సమర్పించాలని ఇంచార్జ్ కలెక్టర్ తెలిపారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు తప్పనిసరిగా పాత అర్జీ రసీదును వెంట తీసుకురావాలని సూచించారు. అర్జీలో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ స్పష్టంగా నమోదు చేయాలని పేర్కొన్నారు.

డిజిటల్ పర్యవేక్షణ సౌకర్యాలు

అర్జీదారులు తమ ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం పలు సౌకర్యాలను అందుబాటులో ఉంచిందన్నారు. సమస్య పరిష్కారమైన వెంటనే అర్జీదారుడి మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుందని తెలిపారు. నోటీసులు, ఎండార్స్‌మెంట్లు వాట్సాప్ ద్వారా పంపించడంతో పాటు, రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఇంటి చిరునామాకు కూడా పంపిస్తారని వివరించారు.

మండలాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ

జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) అమలులో ఉంటుందని తెలిపారు. ప్రజలు తమకు సమీపంలోని కార్యాలయాల్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.

1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి

జిల్లా కలెక్టరేట్‌కు రాకుండానే ప్రజలు తమ సమస్యలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచిందని తెలిపారు. గతంలో సమర్పించిన అర్జీల స్థితిగతులను కూడా ఈ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అలాగే meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అర్జీలు సమర్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం పొందాలని సూచించారు.

ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు సంజనా సింహ తెలిపారు. ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు తప్పనిసరిగా రెవెన్యూ క్లినిక్‌కు హాజరై వినతులు స్వీకరిస్తారని చెప్పారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు స్వీకరించేందుకు సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. మండల తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌కు మండల సర్వేయర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు తమకు సంబంధించిన రికార్డులతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.

రైతులు, ప్రజలు తమ భూసంబంధిత రెవెన్యూ సమస్యలను ఈ రెవెన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply