కనకదుర్గమ్మను దర్శించుకున్న హీరో అల్లరి నరేష్
- ‘కనకదుర్గ’ సినిమా చిత్రీకరణ నిమిత్తం విజయవాడకు రాక
- ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు
- ప్రత్యేక పూజలు నిర్వహించిన హీరోకు వేద ఆశీర్వచనం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ప్రముఖ సినీ నటుడు అల్లరి నరేష్ గురువారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలోని శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ‘కనకదుర్గ’ సినిమా చిత్రీకరణ నిమిత్తం నాలుగు రోజుల పాటు విజయవాడకు వచ్చిన ఆయన షూటింగ్ విరామ సమయంలో అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయానికి చేరుకున్న అల్లరి నరేష్‌కు దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, దేవస్థాన అధికారులు శేషవస్త్రం కప్పి సత్కరించారు. అలాగే అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు హీరో అల్లరి నరేష్‌ను చూసేందుకు ఆసక్తి చూపగా, ఆలయ అధికారులు దర్శన కార్యక్రమం సజావు సాగేలా తగిన ఏర్పాట్లు చేశారు.
