ఆడపడుచుగా అమ్మవారికి ఆషాఢ సారె.. ఇంద్రకీలాద్రిపై భక్తి వెల్లువ

  • 18 సారె బృందాల్లో 7,940 మంది భక్తుల రాక..
  • సారె భక్తుల కోసం రూ.100 భవానీ అనుగ్రహ దర్శన్…
  • స్వాగతం పలికిన దుర్గ గుడి చైర్మన్ బుర్ర రాధాకృష్ణ..
  • క్యూలైన్లు, తాగునీరు, ఉచిత ప్రసాద పంపిణీ
  • పరిశీలించిన ఈవో వి.కె. శీనా నాయక్..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: ఆషాఢ మాస సారె ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో అమ్మవారికి సమర్పణలు చేస్తూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆషాఢ సారె ఉత్సవాల రెండో రోజు గురువారం ఆలయంలో మహిళా భక్తుల రద్దీ విశేషంగా పెరిగింది.

గురువారం మొత్తం 18 సారె బృందాలకు చెందిన 7,940 మంది భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. వీరికి ఆలయ పాలకమండలి చైర్మన్ రాధాకృష్ణ స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేశారు. సారె సమర్పణకు వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం భవానీ అనుగ్రహ దర్శన్ (రూ.100 దర్శనం) క్యూ లైన్‌ను పూర్తిగా సారె భక్తులకు కేటాయించింది. దీంతో మహిళలు సులభంగా దర్శనం చేసుకుని అమ్మవారికి సారె సమర్పించే అవకాశం కల్పించింది.

భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ స్వయంగా క్యూలైన్లను పరిశీలించారు. దర్శన ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఉచిత ప్రసాదాల పంపిణీ, తాగునీటి సరఫరా తదితర అంశాలను సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లలో తగిన తాగునీటి సదుపాయం, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఆషాఢ సారె ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.