అసభ్య ప్రవర్తన ఆనందం కాదు.. చట్టరీత్యా నేరం

అసభ్య ప్రవర్తన ఆనందం కాదు.. చట్టరీత్యా నేరం

  • డీఎస్పీ హనుమంతరావు

నరసరావుపేట, ఆంధ్రప్రభ: మహిళలు, బాలికల భద్రతకు భంగం కలిగించే అసభ్య ప్రవర్తన ఆనందం కాదని, అది చట్టరీత్యా నేరమని నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు హెచ్చరించారు. పరివర్తనే శాశ్వత పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, మహిళా, శిశు భద్రత విభాగం ఐజీపీ బి. రాజకుమారి మార్గదర్శకత్వంలో, పల్నాడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి. కృష్ణారావు సూచనలతో స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం ‘ఆపరేషన్ దండయాన’లో భాగంగా ‘ఆపరేషన్ పరివర్తన సదన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు ఎస్.ఓ.ఎస్. కేసులు నమోదైన వ్యక్తులతో ప్రత్యేకంగా మాట్లాడారు. గతంలో బాలురు, బాలికలు కలిసి స్వేచ్ఛగా ఆడుకునే వాతావరణం ఉండేదని, ప్రస్తుతం చిన్నారుల భద్రతపై ప్రతి కుటుంబం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు వేగంగా జరుగుతోందని, అరెస్టుల అనంతరం 60 రోజులలోపు చార్జిషీట్లు దాఖలు చేసి, 90 రోజులలోపు విచారణ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వల్ల ఇలాంటి కేసులు ఏడాది లోపే తుది తీర్పుకు వచ్చే అవకాశాలు పెరిగాయని చెప్పారు.

చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు సమాజంలోని ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం ఎస్.ఓ.ఎస్. షీట్లు మాత్రమే ఉన్నాయని, భవిష్యత్తులో మళ్లీ నేరాలకు పాల్పడితే రౌడీ షీట్లు తెరవబడతాయని హెచ్చరించారు. ఒకరికి పడిన శిక్ష సమాజంలోని ఇతరులకు హెచ్చరికగా నిలుస్తుందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరిలో సానుకూల పరివర్తన రావాలని ఆకాంక్షించారు. వ్యక్తుల్లో వచ్చే మార్పు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

మహిళలు, బాలికల భద్రతను బలోపేతం చేయడం, లైంగిక నేరాల పునరావృతిని నిరోధించడం, నేరాలకు పాల్పడిన వారిలో బాధ్యతాయుత ప్రవర్తన పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో లైంగిక నేరాల చట్టపరమైన పరిణామాలు, బాధితులపై నేరాల ప్రభావం, సామాజిక బాధ్యత, వ్యక్తిత్వ వికాసం, కోప నియంత్రణ, నైతిక విలువలు, చట్టాలను గౌరవించే జీవన విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మానసిక వైద్యులు, న్యాయ నిపుణులు, పోలీసు అధికారులు పాల్గొని సూచనలు, సలహాలు అందించారు. మహిళలు, చిన్నారుల గౌరవం, భద్రతకు ప్రతి వ్యక్తి ప్రాధాన్యత ఇవ్వాలని, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆపరేషన్ పరివర్తన సదన్ ద్వారా నేరస్తుల్లో సానుకూల ఆలోచనా విధానాన్ని పెంపొందించి, వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమం ముగింపులో హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది నజీమా, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సుస్మిత, ఆర్వీఆర్ కాలేజీ లెక్చరర్ రాజ్యలక్ష్మి, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుభాషిణి, వన్‌టౌన్ సీఐ ఎస్.కే.టి. ఫిరోజ్, రూరల్ సీఐ ఎం.వి. సుబ్బారావు, దాచేపల్లి సీఐ ఎం. రాజేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.