విజయవాడలో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర

  • పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు

భవానీపురం, ఆంధ్రప్రభ : విజయవాడ భవానీపురంలోని సితార గ్రౌండ్స్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జూలై 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జగన్నాథ స్వామివారి దర్శనం చేసుకుంటారు. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి, వేదమంత్రాలు, భజనలు, హరినామ సంకీర్తనల నడుమ సితార గ్రౌండ్స్ నుంచి రథయాత్రను ఘనంగా నిర్వహించారు.

ఈ మహోత్సవంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గురువారం పాల్గొని శ్రీ జగన్నాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని లాగి రథయాత్రలో పాల్గొని భక్తులతో కలిసి హరినామ సంకీర్తనలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ, శ్రీ జగన్నాథ రథయాత్ర భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ వైభవానికి ప్రతీక అని అన్నారు.

ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తి, సామరస్యం, సద్భావనలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భగవంతుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు పాల్గొని రథయాత్రను విజయవంతం చేశారు. భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేశారు.