ఖరీఫ్ సాగుకు మూడు దశల్లో నీటి సరఫరా
- జూలై 16 నుంచి తొలి తడి ప్రారంభం
- ప్రాజెక్టులో నీటి లభ్యతను బట్టి నాలుగో తడి విడుదల
సూర్యాపేట, ఆంధ్రప్రభ : ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సాగునీరు అందించేందుకు మూసీ ప్రాజెక్టు అధికారులు నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటించారు. గురువారం (జూలై 16) నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మూడు దశల్లో నీటిని విడుదల చేయనున్నట్లు, ప్రాజెక్టులో నీటి నిల్వలను బట్టి అవసరమైతే నాలుగో తడిని కూడా అందిస్తామని అధికారులు తెలిపారు.
మొదటి దశలో జూలై 16 నుంచి ఆగస్టు 5 వరకు 20 రోజుల పాటు కాలువల ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం 15 రోజుల విరామం ఇచ్చి, రెండో దశలో ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 4 వరకు మరో 15 రోజుల పాటు నీటిని సరఫరా చేస్తారు. ఇక మూడో దశలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు 15 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. మొత్తం మూడు దశల్లో రైతులకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు.
2.819 టీఎంసీల నీటి వినియోగం
ప్రస్తుతం ప్రాజెక్టులో 640.92 అడుగుల నీటిమట్టం వద్ద 3.098 టీఎంసీల నికర నీరు అందుబాటులో ఉంది. మూడు దశల్లో మొత్తం 2.819 టీఎంసీల నీటిని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం సుమారు 0.279 టీఎంసీల నికర నీరు మిగిలే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టులోకి వచ్చే వరద నీటి లభ్యతను బట్టి నాలుగో తడి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
