మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల కొరడా..
కొత్తగూడెం, ఆంధ్రప్రభ : మోడిఫైడ్ సైలెన్సర్లతో అధిక శబ్దం చేస్తూ తిరుగుతున్న ద్విచక్ర వాహనాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో 12 ద్విచక్ర వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్లతో నడుస్తున్నట్లు గుర్తించారు. ఆ వాహనదారులపై మోటారు వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 190(2) ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. అనంతరం వాహనాలకు అమర్చిన మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి పోలీస్ స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మోడిఫైడ్ సైలెన్సర్ల వల్ల తీవ్రమైన శబ్ద కాలుష్యం ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ఇటువంటి మార్పులు చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. వాహనదారులు కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న సైలెన్సర్లనే వినియోగించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

