చినుకు పడితే చిత్తడి..

ఖానాపూర్‌లో అధ్వానంగా రహదారులు

గుంతల్లో నిలిచిన వర్షపు నీరు..

మరమ్మతులు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి

ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారులు తేలికపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్నాయని వాహనదారులు, పాదచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్లపై వర్షపు నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పాత బస్టాండ్ వరకు ఉన్న రహదారి దెబ్బతిని, పలుచోట్ల గుంతలు ఏర్పడటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని తెలిపారు.

ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులు మరింత దెబ్బతిన్నాయని, గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. రహదారులకు తక్షణమే మరమ్మత్తులు చేపట్టి గుంతలను పూడ్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.