చెన్నూర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని కొత్తగూడెం కాలనీలో శనివారం వేకువజామున చెన్నూర్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు ఉదయం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు ఈ తనిఖీలు చేపట్టారు.
చెన్నూర్ పట్టణ సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో 15 మంది పోలీస్ సిబ్బందితో కలిసి “కమ్యూనిటీ కాంటాక్ట్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 65 బైకులు, 5 ఆటోలను సీజ్ చేసి జరిమానాలు విధించారు.
అలాగే గుడుంబా విక్రయాలపై ఆరా తీసి, అనుమానితుల ఇళ్లలో ప్రత్యేక బలగాలతో తనిఖీలు చేపట్టారు. కాలనీలో కొత్తగా నివాసం ఉంటున్న వారి వివరాలను సేకరించారు.
ఈ సందర్భంగా సీఐ బన్సీలాల్ మాట్లాడుతూ ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే సమర్థవంతమైన నేర నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. కాలనీలో నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు లేదా అపరిచితులు ఆశ్రయం పొందుతున్నట్లు అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
యువత మత్తుపదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి ప్రమాదాల నుంచి జాగ్రత్త పడాలని సూచించారు. అలాగే సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాలనీ భద్రత కోసం స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నేర నియంత్రణకు సహకరించాలని సీఐ కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ప్రత్యేక పోలీస్ బలగాలు పాల్గొన్నారు.
