Faceless Services RTA | ఫేస్‌లెస్ సేవలతో డిజిటల్ విప్లవం

Faceless Services RTA | ఫేస్‌లెస్ సేవలతో డిజిటల్ విప్లవం

Faceless Services RTA | ఫేస్‌లెస్ సేవల విస్తరణతో ప్రజలకు పారదర్శక సౌకర్యం
నెక్స్ట్ జెన్ ఎం-పరివాహన్ యాప్‌తో స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ సేవలు
డిజిటల్ ఆర్టీఏ వ్యవస్థతో వేగవంతమైన సేవల విప్లవం

Faceless Services RTA | హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు రవాణాశాఖ ఫేస్‌లెస్ సేవలను విస్తృతంగా అమలు చేస్తోంది. ఈ విధానంలో 22 సేవలను చేర్చారు. ఇందువల్ల వాహనదారులు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు ఆర్టీఏ కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఇంటి వద్ద నుంచే దరఖాస్తు చేసుకుని సేవలను పొందవచ్చు.

భవిష్యత్తులో మరిన్ని సేవలను కూడా ఫేస్‌లెస్ విధానంలో అందుబాటులోకి తీసుకురావాలని శాఖ యోచిస్తోంది. నెల క్రితం 17 సర్వీసులను ఫేస్‌లెస్ భాగంగా సారథి మాడ్యూల్స్‌లో చేర్చారు. తాజాగా మరో 5 సర్వీసులను ఆర్టీఏ అధికారులు చేర్చారు. రాష్ట్రంలో జాతీయ రవాణా పోర్టల్ సారథి సేవలు గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వ్యవస్థలో ఫేస్‌లెస్ సేవలను మరింత విస్తరించి ప్రజలకు సౌకర్యవంతమైన డిజిటల్ సేవలను అందిస్తున్నారు.


త్వరలో నెక్స్ట్ జెన్ ఎం-పరివాహన్

ప్రస్తుతం ఈ సేవలు అధికారిక సారథి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండగా, కొద్దిరోజుల్లోనే నెక్స్ట్ జెన్ ఎం-పరివాహన్ మొబైల్ యాప్‌లో కూడా ప్రారంభించనున్నట్లు రవాణాశాఖ తెలిపింది. డిజిటల్ పరిపాలనను బలోపేతం చేయడంలో భాగంగానే ఫేస్‌లెస్ సేవలను ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీ తగ్గనున్నది.

భారత ప్రభుత్వం, జాతీయ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధి చేసిన అధికారిక మొబైల్ యాప్ నెక్స్ట్ జెన్ ఎం-పరివాహన్. ఇది వాహనదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) వంటి పత్రాలను డిజిటల్ రూపంలో మొబైల్‌లో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఈ యాప్ ద్వారా లభించే ప్రధాన సేవలు:
వర్చువల్ డాక్యుమెంట్లు – మీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలను యాప్‌లో వర్చువల్ కాపీలుగా సేవ్ చేసుకోవచ్చు.
వెహికల్ సెర్చ్ – ఏదైనా వాహనం నంబర్ ఎంటర్ చేసి, ఆ వాహనం ఎవరి పేరు మీద ఉంది, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ వివరాలు ఎప్పటివరకు ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు.
ఈ-చలాన్ చెల్లింపులు – మీ వాహనంపై ఏవైనా ట్రాఫిక్ చలాన్లు ఉంటే చెక్ చేయడం, చెల్లించడం చేయవచ్చు.
క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ – పత్రాలను భౌతికంగా తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారా ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ చూపించవచ్చు.
పీయూసీసీ స్టేటస్ – వాహనం పొల్యూషన్ సర్టిఫికేట్ వివరాలను రియల్ టైమ్‌లో తనిఖీ చేయవచ్చు.

వీటితో పాటు హైపోథెకేషన్ ఎంట్రీ, ఫ్యాన్సీ నంబర్ రిజర్వేషన్, ఎన్ఓసీ దరఖాస్తు సేవలు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి.


ఫేస్‌లెస్ సేవలు ఇవే..

  1. డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్ (ఎల్‌ఎల్) జారీ
  2. ఎల్‌ఎల్, డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్), కండక్టర్ లైసెన్స్ (సీఎల్)లో మొబైల్ నంబర్ నవీకరణ
  3. డీఎల్ పునరుద్ధరణ
  4. డీఎల్ స్థానంలో కొత్త లైసెన్స్ జారీ
  5. డ్రైవర్‌కు పబ్లిక్ సర్వీస్ వెహికల్ (పీఎస్‌వీ) బ్యాడ్జ్ జారీ
  6. డీఎల్‌లో పేరు మార్పు
  7. డ్రైవింగ్ లైసెన్స్‌లలో వాహన తరగతుల (సీవీ) తొలగింపు
  8. సీఎల్ పునరుద్ధరణ
  9. డూప్లికేట్ సీఎల్ జారీ
  10. సీఎల్‌లో పేరు మార్పు
  11. ఎల్‌ఎల్‌లో ఫోటో, సంతకం మార్పు
  12. ఎల్‌ఎల్‌లో చిరునామా మార్పు
  13. డూప్లికేట్ డీఎల్ జారీ
  14. డీఎల్‌లో చిరునామా మార్పు
  15. ప్రమాదకర పదార్థాలను రవాణా చేసే వాహనాలను నడిపేందుకు అనుమతి నమోదు (హజార్డస్ మెటీరియల్ ఎండార్స్‌మెంట్)
  16. డ్రైవింగ్ లైసెన్స్ వివరాల ధ్రువీకృత ప్రతులు (డీఎల్ ఎక్స్‌ట్రాక్ట్)
  17. డీఎల్‌లో ఫోటో, సంతకం మార్పు
  18. డీఎల్ జనన తేదీ మార్పు
  19. సీఎల్‌లో చిరునామా మార్పు
  20. సీఎల్‌లో ఫోటో, సంతకం మార్పు
  21. ఎల్‌ఎల్‌లో పేరు మార్పు
  22. ఎల్‌ఎల్ వివరాలు

ఇవి కాకుండా హైపోథెకేషన్ ఎంట్రీ, ఫ్యాన్సీ నంబర్ రిజర్వేషన్, ఎన్ఓసీ దరఖాస్తు సేవలు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.

Leave a Reply