డాక్టర్ కావాలన్న కల మధ్యలోనే ఆగిపోయింది..

  • ఆశించిన మార్కులు రాక విద్యార్థిని ఆత్మహత్య
  • నీట్ ఫలితాల విషాదం… కోడుమూరులో విద్యార్థిని మృతి
  • ఒక్క ఫలితం… ఓ కుటుంబంలో తీరని విషాదం

కోడుమూరు, ఆంధ్రప్రభ : వైద్యురాలిగా మారాలన్న లక్ష్యంతో కష్టపడి చదివిన ఓ విద్యార్థిని, నీట్ పరీక్షలో ఆశించిన మార్కులు రాక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన కోడుమూరు మండలం అనుగొండ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఓర్వకల్లు మండలం పాలకొల్లుకు చెందిన రైతు కొండ్ర లక్ష్మీదాసు కుమార్తె మాల పుష్పవతి చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబర్చింది. సంతానం లేని తన సోదరి మాల భాగ్యమ్మ, ఆమె భర్త మాల వేణుగోపాల్ చిన్నారిని తమ వద్దకు తీసుకుని పెంచి చదివించారు.

పుష్పవతి పాణ్యం మండలం నెరవాడ గురుకుల పాఠశాలలో పదో తరగతి వరకు చదివి, అనంతరం కర్నూలులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో బయాలజీ విభాగంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. 2024 ఇంటర్మీడియట్ పరీక్షల్లో 965 మార్కులు సాధించడంతో, ఆమెను వైద్యురాలిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విజయవాడ కానూరులోని నీట్ కోచింగ్ సెంటర్‌లో లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు చేర్పించారు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, కోచింగ్ అనంతరం నీట్ పరీక్షకు హాజరైంది. తరువాత పరీక్ష మళ్లీ నిర్వహించగా, తాజా పరీక్ష కూడా రాసింది. తనకు సుమారు 487 మార్కులు వస్తాయని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే శుక్రవారం ఉదయం నీట్ ఫలితాలను పరిశీలించగా 347 మార్కులు వచ్చినట్లు గుర్తించారు. ఫలితాల స్క్రీన్‌షాట్‌ను కుటుంబ సభ్యులు ఆమెకు పంపించారు. ఆశించిన దానికంటే తక్కువ మార్కులు రావడంతో తీవ్ర నిరాశకు గురైన పుష్పవతి, మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లి బైబిల్ చదువుకుంటానని చెప్పి లోపలికి వెళ్లింది.

కొంతసేపటి తర్వాత కుటుంబ సభ్యులు పిలిచినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా, ఆమె ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే కిందకు దించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

సమాచారం అందుకున్న తండ్రి కొండ్ర లక్ష్మీదాసు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, నీట్ పరీక్షలో ఆశించిన మార్కులు రాక తీవ్ర మనస్తాపానికి గురై తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని, ఆమె మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నారు. ఈ మేరకు కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.