క్రాంతి’కి న్యాయం జరిగే వరకు పోరాటం..
పోలీసుల చర్యలు దుర్మార్గం
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి…
విజయవాడలో క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
పోలీసుల వేధింపులే ఆత్మహత్యకు కారణమం..
సీసీటీవీ ఫుటేజ్ మాయం… ఫిర్యాదుపై కేసు నమోదు కూడా లేదే…
రాష్ట్రంలో పోలీసింగ్ ఉందా…
కుటుంబానికి న్యాయపరంగా అండగా ఉంటాం..
సీఐ నాగరాజు వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి…
కృష్ణలంక, ఆంధ్రప్రభ : విజయవాడలో పోలీసుల వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న పెరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. క్రాంతికుమార్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన, ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, బాధిత కుటుంబానికి పార్టీ తరఫున పూర్తి న్యాయపరమైన సహకారం అందిస్తామని ప్రకటించారు.
వైయస్ జగన్ పరామర్శ…
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రాంతికుమార్ ఆత్మహత్య వ్యవహారంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. విజయవాడలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. క్రాంతికుమార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ఆయన, కుటుంబ సభ్యులతో సమావేశమై వారి వేదనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురికాగా, వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, క్రాంతికుమార్ సాధారణ కారు డ్రైవర్ మాత్రమేనని, ఆయనపై ఎలాంటి కేసులు లేవని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని పదేపదే పోలీస్ స్టేషన్‌కు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. మూడు నెలలుగా పోలీసులు తనను వేధిస్తున్నారని క్రాంతికుమార్ స్వయంగా సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడని గుర్తుచేశారు.
జగన్ మాట్లాడుతూ, విజయవాడ నడిబొడ్డునే ఈ ఘటన జరగడం అత్యంత ఆందోళనకరమన్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయడంలో జాప్యం జరిగిందని ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజ్ మాయమైందనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాలని, డిలీట్ అయిన ఫుటేజ్‌కు బ్యాకప్ ఉండదా అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఐ నాగరాజును సీపీ కాపాడుతున్నారని, సీపీని డీజీపీ, డీజీపీని ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించిన జగన్, ఈ వ్యవస్థలో బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. క్రాంతికుమార్ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, న్యాయపోరాటంలో పూర్తి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.
