Petrol Price Hike | నాలుగోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Price Hike | నాలుగోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Price Hike | పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పెరిగిన చమురు భారం
రోజుకు వందల కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు
పన్నుల భారంతో మరింత పెరిగిన ఇంధన ధరలు
హైదరాబాద్‌లో కొత్త పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే

Petrol Price Hike | న్యూఢిల్లీ: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సోమవారం నాడు మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాయి. పది రోజుల్లో నాలుగోసారి చమురు కంపెనీలు రేట్లు పెంచాయి. పశ్చిమాసియా యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నా, ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం పడుతుందన్న నెపంతో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచేందుకు చమురు కంపెనీలకు అనుమతి ఇవ్వలేదు.

ఎన్నికలు పూర్తయిన వెంటనే మే 15న మొదటిసారి పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచారు. తాజాగా పెట్రోల్‌పై లీటర్కు 2.61 రూపాయలు, డీజిల్‌పై లీటర్కు 2.71 రూపాయలు పెంచాయి. మే 15న 3 రూపాయలు చొప్పున పెంచిన చమురు కంపెనీలు, రెండోసారి మే 19న పెట్రోల్, డీజిల్‌పై లీటరు 90 పైసలు చొప్పున పెంచాయి. మూడోసారి మే 23న పెట్రోల్‌పై లీటర్కు 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచాయి. నాలుగోసారి మే 25న పెట్రోల్‌పై 2.61 రూపాయలు, డీజిల్‌పై 2.71 రూపాయలు పెంచాయి.

మొత్తం నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్‌పై 14.90 రూపాయలు పెరిగింది. ఇందులో పెట్రోల్‌పై 7.38 రూపాయలు, డీజిల్‌పై లీటర్కు 7.52 రూపాయలు పెరిగింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంయుక్తంగా పెంచిన ఈ రేట్లు సోమవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించాయి.

పది రోజుల్లో నాలుగోసారి పెంపు

పెట్రోల్‌పై: రూ. 2.61
డీజిల్‌పై: రూ. 2.71

హైదరాబాద్‌లో లేటెస్ట్ ధరలు

పెట్రోల్: రూ. 115.69
డీజిల్: రూ. 103.82

రోజుకు 600 కోట్లు నష్టం…

మే 15 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ రేట్లను కంపెనీలు నాలుగు సార్లు పెంచాయి. రేట్లు పెంచక ముందు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు 1000 కోట్లు నష్టం భరిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. నాలుగు సార్లు రేట్లు పెంచిన తరువాత రోజుకు ఈ నష్టాలు 600 కోట్లుగా ఉన్నాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ సోమవారం నాడు చెప్పారు. మే 15 ఇంధన రేట్లు పెంచడానికి ముందు చమురు కంపెనీలకు రోజుకు 1000 కోట్లు నష్టాలు వచ్చాయని, తాజాగా ఇవి తగ్గాయని చెప్పారు. ఈ నష్టాల్లో ఎల్పీజీ విక్రయాలతో వచ్చే నష్టాలు కూడా కలిసి ఉన్నాయని సుజాతా శర్మ తెలిపారు. గ్యాస్ ధరలో ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తున్నట్లు చెప్పారు.

ముడి చమురు ధరలు 50 శాతానికి పైగా పెరిగినప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు సవరించకపోవడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాలు భారీగా పెరిగాయి. ముడి చమురు ధరలు భారీగా పెరగడం వల్ల రేట్లు పెంచుతున్నప్పటికీ ఇవి సరిపోవడం లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పారు.

పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున ఇంధన ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయని, రేట్లు పెంచడం ద్వారా వస్తున్న లాభాలు నష్టాలను ఇంకా భర్తీ చేసే స్థాయిలో లేవన్నారు. ఇంధన ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుతుందని భావించిన కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై లీటర్కు ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయలు తగ్గించింది. దీంతో ప్రతినెలా కేంద్రం 14,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది.

పన్నుల భారం ఎక్కువ..

కేంద్ర ప్రభుత్వం మే 27న పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని 10 రూపాయలు తగ్గించింది. దీని తరువాత బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ లీటర్కు 1.40 రూపాయలు, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ లీటర్కు 3 రూపాయలు, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ లీటర్కు 2.50 రూపాయలు, రోడ్ అండ్ ఇన్‌ఫ్రా సెస్ లీటర్కు 5 రూపాయలు వసూలు చేస్తున్నారు.

ఈ మొత్తం పెట్రోల్‌పై లీటర్కు 11.90 రూపాయలుగా ఉంది. ఇదే తరహా పన్నులు డీజిల్‌పై లీటర్కు 7.80 రూపాయలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రాల వారీగా వ్యాట్‌ను ప్రత్యేకంగా వసూలు చేస్తున్నారు. తెలంగాణలో పెట్రోల్‌పై లీటరు వ్యాట్ 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. తాజాగా రేట్లు పెరిగిన తరువాత హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు లీటర్కు 115.69 రూపాయలు, డీజిల్ రేటు 103.82 రూపాయలుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా దేశీయంగా ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలకు రేట్లను సవరించేందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఎన్నికలు పూర్తయిన వెంటనే వెంట వెంటనే భారాలు వేయాల్సి వస్తోందని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. చమురు సంస్థలు భారీగా నష్టాలను ఎదుర్కోవడంతో తప్పనిసరిగా రేట్లు పెంచాల్సి వస్తోందని వారు స్పష్టం చేస్తున్నారు. ముడి చమురు రేట్లు పెరగడంతో ప్రైవేట్ ఇంధన సంస్థలు అందుకు అనుగుణంగా రేట్లు సవరించాయి.

Leave a Reply