Accident | నిర్మాణ భవనంలో ఘోర ప్రమాదం..

Accident | నిర్మాణ భవనంలో ఘోర ప్రమాదం..

లిఫ్ట్ తెగిపడి ఇద్దరు కార్మికుల మృతి

Accident | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం నగరంలోని పీఎన్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనంలో జరిగిన ఘోర ప్రమాదం ఇద్దరు భవన నిర్మాణ కార్మికుల ప్రాణాలను బలిగొంది. నిర్మాణ సామగ్రిని పై అంతస్తులకు తరలిస్తున్న సమయంలో లిఫ్ట్ తెగిపడటంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జరుగుల్ల సూర్యనారాయణ (53), గొట్ట ముఖలింగం (56)లను వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.

మూడో అంతస్తులో లిఫ్ట్‌ను ఆపరేట్ చేస్తున్న సమయంలో నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply