విజయవాడ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం..

- ఎన్‌హెచ్‌ఏఐకి ఎంపీ కేశినేని చిన్ని రెండు కీలక ప్రతిపాదనలు
- 6 లేన్ల ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి
- కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి గంగూరు వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన
- భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి
ఆంధ్రప్రభ విజయవాడ : రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక, రవాణా రంగాల కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంలో రోజురోజుకు తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) కీలక అడుగులు వేశారు. నగర భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రాజెక్టుల సభ్యుడు విప్నేష్ శర్మకు రెండు కీలక ప్రతిపాదనలతో కూడిన లేఖలను పంపించారు.
నగర అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి మౌలిక సదుపాయాలను విస్తరించాల్సిన అవసరం ఉందని ఎంపీ తన లేఖల్లో స్పష్టం చేశారు. ముఖ్యంగా జాతీయ రహదారి-16పై మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు రైల్వే బ్రిడ్జి వరకు ప్రతిపాదిత 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని కోరారు.
ప్రస్తుతం బెంజ్ సర్కిల్ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయని, మహానాడు, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు కూడళ్ల వద్ద తరచూ ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు గంటల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తులో మచిలీపట్నం పోర్టు కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభమైతే సరుకు రవాణా మరింత పెరిగి పరిస్థితి క్లిష్టంగా మారే అవకాశముందని హెచ్చరించారు. డీపీఆర్ పూర్తై ప్రాజెక్టు ఆమోదం పొందినప్పటికీ వివిధ కారణాలతో పనులు ముందుకు సాగకపోవడం విచారకరమని పేర్కొన్నారు.
అదే సమయంలో విజయవాడ నగర తూర్పు భాగంలో పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని కనకదుర్గ ఫ్లైఓవర్ చివరి భాగం నుంచి గంగూరు వరకు సుమారు 14 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని పరిశీలించాలని ఎన్‌హెచ్‌ఏఐకి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం కారిడార్‌లో వాహనాల సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
రాజీవ్ గాంధీ పార్క్, బెంజ్ సర్కిల్, ఆటోనగర్, కనూరు, పోరంకి, పెనమలూరు, గంగూరు ప్రాంతాలు ప్రస్తుతం ట్రాఫిక్ సంక్లిష్టతకు కేంద్రాలుగా మారాయని, ప్రమాదకర కూడళ్లు, తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్‌లు ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఎంపీ వివరించారు.
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ద్వారా నగర అంతర్గత ట్రాఫిక్‌కు, జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు వేర్వేరు మార్గాలు అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. అదనంగా విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి-65 విస్తరణకు సంబంధించిన ప్రస్తుత డీపీఆర్‌ను కూడా పునఃసమీక్షించాలని కోరారు. ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్‌కు అనుగుణంగా కొత్త ప్రణాళికలు రూపొందిస్తే భవిష్యత్ రవాణా అవసరాలను సమర్థవంతంగా తీర్చవచ్చని సూచించారు.
రవాణా రంగానికి కొత్త దిశ?
విజయవాడ నగరం రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రబిందువుగా మారుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం అత్యవసరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని చిన్ని చేసిన ప్రతిపాదనలు అమలులోకి వస్తే నగర ట్రాఫిక్ నిర్వహణలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. ముఖ్యంగా రాబోయే దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్రతిపాదనలు విజయవాడను ఆధునిక రవాణా మౌలిక వసతులతో కూడిన నగరంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులుగా భావిస్తున్నారు.
