కంతనపల్లి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలి

  • ఏఎస్‌యూ నాయకులు దబ్బగట్ల శ్రీకాంత్

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని కంతనపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదివాసి విద్యార్థి సంఘం (ASU) నాయకులు దబ్బగట్ల శ్రీకాంత్ ఆరోపించారు. రోడ్డంతా భారీ గుంతలు ఏర్పడి వర్షపు నీటితో నిండిపోవడంతో విద్యార్థులు, రైతులు, కూలీలు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు.

వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. అత్యవసర సమయంలో అంబులెన్స్,అగ్నిమాపక వాహనాలు కూడా గ్రామానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.గ్రామ ప్రజలు పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్యను తెలియజేసినా శాశ్వత చర్యలు తీసుకోలేదని విమర్శించారు.జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి కంతనపల్లి రహదారికి సీసీ లేదా బీటీ రోడ్డు నిర్మించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామ ప్రజలు, ఏఎస్‌యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.