Khammam ప్రజల భద్రతే లక్ష్యంగా వరద నిర్వహణ ప్రణాళిక
Khammam ప్రజల భద్రతే లక్ష్యంగా వరద నిర్వహణ ప్రణాళిక
- వర్షాకాలం వరదలపై కమిషనర్ అభిషేక్ అగస్త్య సమీక్ష
ఖమ్మం (Khammam), ఆంధ్రప్రభ: రానున్న వర్షాకాలంలో వరదలు, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆధ్వర్యంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నగర ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. వరదలు సంభవిస్తే చేపట్టాల్సిన సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.
గతంలో వరదల సమయంలో తీసుకున్న చర్యలు, ప్రభావిత ప్రాంతాలు, ప్రజల తరలింపు విధానం, పునరావాస కేంద్రాల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించి, ఈసారి మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముంపు ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, విద్యుత్, వైద్య సేవలు, పారిశుధ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ముంపు ప్రభావిత డివిజన్ల గుర్తింపు
నగరంలోని 16, 17, 28, 29, 30, 35, 39, 46, 47, 48, 59, 60 డివిజన్లను ముందస్తుగా ముంపు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని కమిషనర్ ఆదేశించారు.
ప్రతి డివిజన్‌లో వాలంటీర్ల వ్యవస్థను సమీక్షించి, అవసరమైతే కొత్త వాలంటీర్లను నియమించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వారు తీసుకోవాల్సిన చర్యలపై ముందస్తు శిక్షణ ఇవ్వాలని తెలిపారు.
వరదల సమయంలో నీటి మట్టం ఆధారంగా హెచ్చరికలు జారీ చేయడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాలకు చేర్చడం వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
వరదల అనంతరం పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక శానిటేషన్ ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే శుభ్రత కార్యక్రమాలు చేపట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని తెలిపారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు పకడ్బందీగా చేపట్టాలని కమిషనర్ అభిషేక్ అగస్త్య స్పష్టం చేశారు.

