భక్తుల సౌకర్యాలపై అధికారుల దృష్టి ఏమిటి?
భక్తుల సౌకర్యాలపై అధికారుల దృష్టి ఏమిటి?
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: ఫోటో 1: లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ రాష్ట్ర ఇంచార్జ్ కమిషనర్ రామచంద్ర మోహన్.
ఫోటో 2: ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్న దేవాదాయ శాఖ రాష్ట్ర ఇంచార్జ్ కమిషనర్ రామచంద్ర మోహన్.
ఫోటో 3: స్వామివారి చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయ అధికారులు.
ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని దేవాదాయ శాఖ రాష్ట్ర ఇంచార్జ్ కమిషనర్ రామచంద్ర మోహన్ సూచించారు.
జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సోమవారం ఆయన కుటుంబ సమేతంగా సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రామచంద్ర మోహన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ ఆచార్యులు స్వామివారి విశిష్టతను వివరించారు. అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు ఇచ్చారు.
అనంతరం ఆలయ పరిసరాలు, అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కోనేరులను ఆయన పరిశీలించారు. దేవాదాయ శాఖ ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు.
ఆలయ నాలుగు రాజగోపురాల నిర్మాణం, ప్రాకార అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం నీటి సదుపాయం కోసం ఓవర్‌హెడ్ ట్యాంక్ ఏర్పాటు, వసతి గదుల నిర్మాణం, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. 22 ఆలయాలను ప్రత్యేక ఆలయాలుగా, 175 ఆలయాలను ‘6ఏ’ వర్గంలో గుర్తించినట్లు పేర్కొన్నారు.
పెన్నాహోబిలం ఆలయంలో భక్తుల వసతి కోసం అదనంగా 30 గదులు, మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు డిప్యూటీ కమిషనర్ రామాంజనేయులు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి గంజి మల్లికార్జున ప్రసాద్, ఆలయ ఈవో సాకే రమేష్ బాబు, ఇన్స్పెక్టర్ రాణి, ధర్మకర్తల మండలి చైర్మన్ రేగటి నాగరాజు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
