సింహాచలంలో బీర్ల అయిలయ్య దంపతుల ప్రత్యేక పూజలు

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ప్రసిద్ధి చెందిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య – బీర్ల అనిత తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
25వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సింహాద్రి అప్పన్నగా ప్రసిద్ధి చెందిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక దర్శనం చేసుకుని, స్వామివారికి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలను బీర్ల అయిలయ్య కి అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు మరియు అర్చకులు సింహాచలం దేవస్థానం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వారికి వివరించారు. స్వామివారి కృపతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని బీర్ల అయిలయ్య – అనిత దంపతులు ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. భక్తులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని, ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన ద్వారా మరింత సేవాభావంతో ప్రజలకు అందుబాటులో ఉంటామని బీర్ల అయిలయ్య తెలిపారు.
