Lenin Movie | బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ జోరు..

రెండు రోజుల్లో రూ.37.2 కోట్ల గ్రాస్
అఖిల్ కెరీర్‌లో భారీ ఓపెనింగ్స్
మౌత్ టాక్‌తో పెరుగుతున్న వసూళ్లు..
వీకెండ్‌లో మరింత జోరు ఉంటుందన్న ట్రేడ్ వర్గాలు

Lenin Movie |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.37.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో సినిమా వసూళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ రావడం కలెక్షన్లపై స్పష్టమైన ప్రభావం చూపుతోంది. ఈ సందర్భంగా రెండు రోజుల్లో రూ.37.2 కోట్ల గ్రాస్ సాధించిన విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. అఖిల్ నటనకు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తుండగా, చాలా కాలంగా ఎదురుచూస్తున్న కమర్షియల్ విజయాన్ని ఈ సినిమా అందించిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామీణ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అఖిల్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీకెండ్ సెలవులు కలిసివస్తుండటంతో ‘లెనిన్’ వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.