మూడేళ్లుగా పెండింగ్‌లో భూమి పట్టాలు..
రైతులకు వెంటనే న్యాయం చేయాలి
ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి
శ్రీ సత్య సాయి , ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని నంబులపూలకుంట మండలం, మర్రికొమ్మదిన్నె పంచాయతీ పరిధిలోని జౌకల గ్రామ రైతుల భూమి పట్టాల సమస్యను వెంటనే పరిష్కరించాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు.
జౌకల గ్రామ రైతులు తనను కలిసి తమ సమస్యను వివరించారని ఆయన తెలిపారు. 2023లో జిల్లా యంత్రాంగం భూముల సర్వే నిర్వహించి భూ హక్కులను గుర్తించినప్పటికీ, ఇప్పటి వరకు పట్టాలు మంజూరు చేయకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు.
దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. మూడు సంవత్సరాలుగా అధికారులు రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పడం సమంజసం కాదని, ఇది రైతుల హక్కులను నిర్లక్ష్యం చేసినట్లేనని విమర్శించారు.
పెండింగ్‌లో ఉన్న భూమి పట్టాలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే మంజూరు చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, రైతులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
రైతుల హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, రైతుకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రైతు హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.
